Saturday, September 4, 2010

తెలంగాణా సమాజం ఈ పరీక్షలు వద్దంటున్నది, జీవితం మొత్తం యుద్ధమేనా ? ఇలా ఇంకెంత కాలం? గ్రూప్-1ను మేమే అడ్డుకుంటం, కె.సి.ఆర్.హెచ్చరిక

తెలంగాణా సమాజం యావత్తూ, అన్ని పార్టీల శాసనసభ్యులు, ఆఖరికి మంత్రులు, న్యాయవాదులు, అధ్యాపకులు అందరూ గ్రూప్-1 పరీక్షలు వద్దు అంటుంటే తుపాకులు పెట్టి అయినా, 144 సెక్షన్ విధించి అయినా పరీక్షలు పెడతమంటున్నరు. ఇదేం పద్ధతి ? - అని తెలంగాణా రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్.) అధ్యుక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రశ్నించారు.

తెలంగాణ విద్యార్ధులు తమ వాటా తమకు న్యాయంగా దక్కాలని కోరుతుంటే లేదు, పోలీసు తూటాలతో పరీక్షలు జరిపిస్తమని అహంకారంగా మాట్లాడుతున్నరని, తూటాలు, లాఠీలతో తెలంగాణా విద్యార్థిని నిలువరించలేరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందరూ వాయిదా వేయాలని అడుగుతుంటే, వాయిదా వేసేది లేదని ఇంత మొండికేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం చె ప్పే తీర్తమని ఆయన అన్నారు. బుల్లెట్ల వర్షం కురిసినా రేపటి గ్రూప్-1 పరీక్షలను అడ్డుకు తీర్తమని ఆయన హెచ్చరించారు.

మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఇతర పార్టీల కార్యకర్తలకు తెలంగాణ భవన్‌లో స్వాగతం పలుకుతూ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, అసలు ప్రపంచంలో ఎక్కడైనా తుపాకుల పహరాలో పరీక్షలు జరిగినవా అని ఆయన ప్రశ్నించారు. పరీక్షలు అంటే ఎంతో ప్రశాంతంగా ఉండాలని, విద్యార్ధుల మానసిక పరిస్థితి ప్రశాంతంగా ఉండాల్సి ఉండగా, 144 వ సెక్షన్ పెట్టి పరీక్షలు పెడ్తమని అంటున్నరని ఆయన ఎద్దేవా చేశారు.

జీవితం మొత్తం యుద్ధమేనా ? ఇలా ఇంకెంత కాలం?
జీవితం మొత్తం యుద్ధమేనా ? ఇలా ఇంకెంత కాలం? నీళ్లకోసం, నిధులకోసం, ఉద్యోగాలకోసం, ఆఖరికి ఎరువులకోసం కూడా యుద్ధం చేయవలసి వస్తున్నది. ఆంధ్రలో ఎరువులు వెంటవెంటనే దొరుకుతయ్, మరి తెలంగాణాలో ప్రతి రోజు ఉరకాలె, ఇదేం పద్ధతి అని ఆయన ప్రశ్నించారు.

ఎ.పి.పి.ఎస్.సి. పుట్టినప్పటినుంచి ఇప్పటివరకూ తెలంగాణాకు అన్యాయమే జరిగింది అని, అందుకే తెలంగాణఆ ప్రజలకు న్యాయం జరగాలంటే తెలంగాణ వచ్చాకే సాధ్యమని ఆయన అన్నారు. ఆ విషయాన్ని గుర్తించే మొన్నటి ఎన్నికల్లో గుండెలు చీల్చి మరీ తెలంగాణా ప్రజలు తమ తీర్పు చెప్పిన్రు. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలూ ఖాళీ అవుతున్నయ్. పదేండ్ల క్రితం నేను ఒక్కణ్ణే, ఇప్పుడు ప్రజలంతా ఏకమై ఎక్కడ చూచినా సముద్రమైన్రు అని ఆయన అన్నారు.

సమైక్య రాష్ట్రంలో మనకి న్యాయం జరగదు, కాబట్టే డిసెంబర్ తర్వాత జరిగే మహాయుద్ధానికి అందరూ ఇప్పటినుంచే వీర సైనికులై కదలిరావాలి అని కె.సి.ఆర్. పిలుపు ఇచ్చారు.

No comments:

Post a Comment